Sunday 5 August 2012

29.07.2012 ఆంధ్ర జ్యోతి కథ కలాపి

ఆదివారం ఆంధ్రజ్యోతి 29.07.2012 నాటి పేపరు లో "కలాపి" అని ఓ కథ ప్రచురించబడింది. కథ చదివాక రచయిత్రి మన్నం సింధు మాధురి గారు ఏం చెప్పదలుచుకున్నారో అర్ధం కాలేదు. వాస్తవికత,సహేతుకత, తార్కికతకు దూరంగా ఉంది ఈ కథ. హంపి,తుంగభద్ర ల నేపధ్యం లో సాగుతుంది. 29.07.2012 ఆంధ్ర జ్యోతి కథ కలాపి కధానాయిక కలాపి పదేళ్ళ విరామం తరువాత హంపిలో నున్న తన స్నేహితురాలు లడ్డూ కి ఓ ఉత్తరం వ్రాస్తుంది. సారాంశం ఏమంటే తాను రాసే ఆఖరి ఉత్తరం అని లడ్డూ ని చూడాలని ఉందని అంటూ నీ అల్లరి,తుంగభద్ర,అమ్మమ్మ కథలూ వగైరాలతో పాటు బంగ్లా శరణార్ధులూ, విదేశీయులకి నీవు నేర్పిన యోగ మొదలైనవి నీ సమక్షములో గుర్తు చేసుకోవాలని ఉంది అంటూ ఉత్తరం సాగుతుంది. అయితే మధ్యలో బంగ్లా శరణార్ధులు యెక్కడినుండి వచ్చారో అర్ధం కాదు. తార్కికత లేదు. "పెళ్ళితో పనిలేని ప్రేమలున్న దగ్గర ప్రేమతో పనిలేని పెళ్ళిళ్ళు ఉండకూడదా" అన్న వాక్యాలు లడ్డూ గదిలో గోడ మీద వేలాడుతూ ఆమెని ఎంతో ఆలోచింపచేస్తాయట.పెళ్ళి తో పని లేని ప్రేమల గమ్యం ఏంటో పక్కకి పెడితే ప్రేమతో పని లేని పెళ్ళి అంటే ప్రేమ లేకపోయినా పెళ్ళి అనే బంధానికి కట్టుబడి జీవితం సాగించడం కాబోలు అని అనుకుందామంటే ఆ స్పష్టత కూడా కథలో లోపించింది. ఎందుకంటే కధానాయిక కలాపి మహా అందం తో అలరారుతూ ఆ అందానికి దాసులయిన మగవారిని ఒకరి తరువాత ఒకరుగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటుంది.పైగా పదే పదే ఫలానా అతను నా అందానికి మెచ్చి కానుకలు పంపాడు, బాగా సంపన్నుడట,నన్ను పెళ్ళాడుతాడట అంటూ డబ్బు పై వ్యామోహం తప్ప మనకు ఇంకే ఫీలింగూ కలాపి లో కనిపించదు. రచయిత్రి రొటీన్ కి భిన్నం గా ఉంటుందనుకున్నారేమో కథలో కలాపి అందాన్ని జుగుస్పాకరమైన వర్ణనలతో వర్ణించారు. ఉదాహరణకు దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరుగెత్తి అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు కలాపి ఒంటి మెరుపు. ఓ చోట కుబుసం విడిచిన త్రాచులా, జర్రి గొడ్డువేగం, మిన్నాగులాగా కథ చివరలో కూడా అందంగా చీమలు చుట్టి కుట్టిన సర్పంలా నవ్వింది వంటి వాటి తో కథ సాగింది. కలాపి హంపికి ఎప్పుడు వచ్చినా కొండలెక్కుతూ ఉంటుంది. కొండలెక్కినప్పుడు అలసట వస్తే ఏం చేస్తావు అని లడ్డూ అడుగుతుంది. తుంగభద్ర ఎప్పుడైనా అలసిపోతుందా అని కలాపి నవ్వుతుంది అని రచయిత్రి రాశారు. ఇది అర్ధం లేని పోలిక అనిపించింది. ఎందుకంటే కొండలెక్కడం అన్నది ఇక్కడ ఒక హాబీ మాత్రమే. జీవితం లో ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాల్సివచ్చినపుడు చేసే ప్రయాణం లో వచ్చేది అలసట. ఆ లక్ష్యసాధకులని నది తో పోల్చి నది కెలాగైతే గమ్యం చేరేవరకు అలసట ఉండదో అలాగే వారికీ అలసట ఉండదు అని అంటాం. చివరగా తాత్వికతనీ, మానవత్వాన్ని కూడా కథలో చొప్పించాననుకున్నారు రచయిత్రి. కథలో ఎక్కడా కలాపి మగవారిలో దేనికోసం వెతుకుతున్నదో వివరణ లేదు కాని ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాక తాను వెతికింది ఏ మగాడిలోనూ కనిపించలేదని తేల్చింది. ఈ కూడగట్టిన డబ్బంతా అనాధలకూ, బాధితులకూ పునరావాసం ఏర్పాటుతో కథ ముగుస్తుంది.మరి ఇందులో లడ్డూ కి కలాపిలో శిఖరంలాంటి వ్యక్తిత్వం ఎక్కడ కనిపించిందో ఆమె కలాపినుండి ఏం నేర్చుకోవాలో మనకి తెలియదు. ఈ కథ ద్వారా రచయిత్రి ఏం ప్రయోజనం ఆశించారో, పాఠకులకి ఏం సందేశం అందించాలనుకున్నారో అర్ధం కాలేదు.

Tuesday 31 January 2012

కథాజగత్ విశ్లేషణ - సత్యం - శ్రీవల్లీరాధిక


నేను విశ్లేషణకు ఎంచుకున్న కథ టి. శ్రీవల్లీరాధిక గారి సత్యం. http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/satyam---ti-srivalliradhika
ఈ కథ లో రచయిత్రి అద్వైత సిధ్ధాంతాన్ని చాలా సరళంగా ప్రతిపాదించారనిపించింది. అహంకారంతో ఏ విషయాన్నైనా ఇదింతే అని సిధ్ధాంతీకరించేస్తాం. సత్యాన్ని విభిన్నంగా వారి వారి భావావేశాలకనుగుణంగా విభజించుకుంటాం.
ఎన్నో ఏళ్ళుగా శైలజ ఇంట్లో పని చేసే సత్తెమ్మ ఒక నిరక్షరాస్యురాలు. స్పందన, తర్కం తెలియదు. కాని తన అనుభవసారంతో యజమానురాలి బలహీనతని భయంగా జమ కడుతుంది. అందుకే అంటుంది “నేనెక్కడ మానేస్తానో అని శైలజమ్మ కి భయం” అని.
భయం ఒక బలహీనత. దాన్ని అహంకారం మాటున దాచుకుని తన కన్నా తక్కువ స్థాయి వారిని అమానవీయంగా ఛీత్కరిస్తారు. ఇది శైలజ పాత్ర లో మనకి కనబడుతుంది.
సంతోష్ ని హూంకరించిన పూలచీరావిడ అహంకారం వెనుక అంతర్లీన శోకం కనిపిస్తుంది. పనిమనిషి పనిలోకి రాకపోతే మనం అచేతనులం.
ఈ భయ శోకాల మాయ కమ్ముకున్నపుడు విచక్షణ కోల్పోయి ఆధిక్యం చూపడం జరుగుతుంది. ఆ మాయ వీడిపోతే, ‘అవును ఇది ఇలా ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు అక్షర సత్యాలన్న విషయం అర్ధమవుతుంది.
ప్రతి వర్గం వారు ఒక సిధ్ధాంతాన్ని వారి ఆలోచనా ప్రాతిపదికగాతర్కించి విభేదిస్తారు. కాని ఒక నిర్వికార అనుభవసారంతో తనకి తెలిసిన ఒక సత్యాన్ని సత్తెమ్మ ఒక కొత్త కోణంలో చెప్పడం చాలా బాగుంది.
అయితే రచయిత్రి ఒకచోట ఇలా అంటారు. “ఏదో ఒక విషయాన్ని నమ్మడమే మన అందరికీ ఇష్టమయినపుడు దానికి అందరమూ సిధ్ధమయినపుడు అది అందరికీ అంతగా అలవాటయిన విషయమయినపుడు అందరమూ ఒకటే విషయాన్ని ఎందుకు నమ్మలేం? అసహనం, ఘర్షణా లేకుండా ఎందుకు ఉండలేం” అని.
ఈ పై వాక్యాలలో "ఐతే అది అందరికీ అంతగా అలవాటయిన విషయమైనపుడు" అన్నదానికన్న “అయితే అది అందరికీ అంతగా ఆచరణాత్మకమైన విషయమైనపుడు” అని ఉంటే బాగుండుననిపించింది.
మొత్తమ్మీద మానవ స్వభావం లో బహీనతలు, భయాలు వాటి మాటున ”సత్యం“ అన్నది విభిన్నంగా తోచడం, అదే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి నిశితంగా గమనిస్తే సత్యం ఒక్కటే అన్నది బాగా విశ్లేషించారు రచయిత్రి.